
రచయిత, పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ను అందుకున్నారు. సినీ రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఉత్తమ తెలుగు చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో భాగంగా ‘తెలుగు సినిమాపై వచ్చిన ఉత్తమ రచనల’ కేటగిరీలో జయదేవ రాసిన పుస్తకానికి 2024వ సంవత్సరానికి గాను ఈ గౌరవం లభించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలను తవ్వితీసి, జయదేవ రచించిన ‘మన సినిమా… ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని ‘ఉత్తమ సినీ గ్రంథం’గా రాష్ట్ర ప్రభుత్వ జ్యూరీ ఎంపిక చేసింది. శనివారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గద్దర్ అవార్డు సిల్వర్ మెమెంటో, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని జయదేవకు అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ‘మన సినిమా… ఫస్ట్ రీల్’ పుస్తకం ప్రతిని ఉప ముఖ్యమంత్రి అందుకొని, రచయితను అభినందించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సినిమా అవార్డులు ప్రకటించడం ఇదే తొలిసారి. ఆ తొట్టతొలి అవార్డే రెంటాల జయదేవను వరించడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులుగా పాపులరైన ఈ పురస్కారాల్లో… గతంలో 2011వ సంవత్సరానికి గానూ జయదేవకు ‘ఉత్తమ సినీ విమర్శకుడు’గా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ గౌరవం సైతం అందుకున్నారు. తాజా గద్దర్ అవార్డుతో… అటు నంది, ఇటు గద్దర్… రెండూ సాధించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పురస్కార విజేత అయిన తొలి జర్నలిస్టు అనే అరుదైన రికార్డు జయదేవకు దక్కింది.
గద్దర్ అవార్డుకు ఎంపికైన ఈ ‘మన సినిమా… ఫస్ట్ రీల్’ పుస్తకం… దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై జయదేవ పాతికేళ్ళ పరిశోధనా పరిశ్రమకు ప్రతిఫలం. ఇప్పటికీ మన సినీ చరిత్రలో నమోదు కాకుండా మిగిలిపోయిన అనేక అంశాలను తవ్వి తీసిన అరుదైన రచన ఇది. మూకీ సినిమాల రోజుల నుంచి తెర మీద బొమ్మ మాటలు నేర్చి, భాషల వారీగా ప్రత్యేక శాఖలుగా విడివడిన టాకీల తొలి రోజుల దాకా మన భారతీయ సినిమాలో, ముఖ్యంగా మన తెలుగు సినిమాలో జరిగిన మనకు తెలియని అనేక పరిణామాలను సాక్ష్యాలతో, సవిశ్లేషణాత్మకంగా రాసిన ఉద్ర్గంథం ఇది. శ్రమించి సేకరించిన దాదాపు వందేళ్ళ క్రితపు అలనాటి పత్రికా సమాచారం, ఫోటోల లాంటి ప్రామాణిక ఆధారాలతో… అరుదైన సమాచారంతో… ఈ సినీ చరిత్ర రచన సాగింది.
తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రం ‘కాళిదాస్’ (1931)పై అనేక కొత్త సంగతులను రెంటాల జయదేవ ఇందులో తవ్వితీశారు. నిజానికి, అది ఒక సినిమా కాదనీ, మూడు చిన్న నిడివి చిత్రాల సమాహారమనీ, అందులో ప్రధాన భాగమైన ‘కాళిదాస్’ కథాచిత్రం మాత్రం 4 రీళ్ళ నిడివిలో పూర్తిగా తెలుగులోనే తీసిన లఘుచిత్రమనీ తెలిపారు. అలనాటి సాక్ష్యాధారాలతో నిర్ద్వంద్వంగా నిరూపించారు. తమిళులు దాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే... పూర్తి తెలుగు డైలాగులున్న ఆ సినిమాను తెలుగువాళ్ళం మన సినిమాల లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామనీ గుర్తుచేశారు. మనం విస్మరిస్తున్న తొలినాళ్ళ తెలుగు సినీచరిత్రను అక్షరబద్ధం చేశారు.
హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీసీమల్లో వచ్చిన తొట్టతొలి టాకీలకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఈ రచనలో జయదేవ అందించారు. అత్యంత అరుదైన దాదాపు 2 వేల పత్రికా ప్రకటనలు, ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల పైగా నిరంతరాయంగా ఆయన తన రచనలతో ప్రత్యేక కృషి చేస్తున్నారు. తొలి పూర్తి నిడివి పది రీళ్ళ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని కూడా గతంలో రెంటాల జయదేవే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా దినోత్సవం విషయంలో అనేక దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న తప్పులను ఆయన సాక్ష్యాధారాలు చూపి, సరిదిద్దారు. రెంటాల జయదేవ విశిష్ట కృషిని గుర్తించి, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఉత్తమ సినీ విమర్శకుడి’గా ప్రతిష్ఠాత్మకమైన ‘నంది’ అవార్డును అందిస్తే.. ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఈ ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పరిశోధనాత్మక గ్రంథానికి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డును ప్రదానం చేసింది.