
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు కమ్మేస్తున్నాయి. ఒకరి మరణం మరిచేలోపే మరొకరి మరణం ఇండస్ట్రీని కలవరపెడుతోంది. కొందరు అనారోగ్యంతో, మరికొందరు ఆత్మహత్యల ద్వారా, ఇంకొందరు వయోభారంతో ఈ లోకాన్ని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో, మరో దుఃఖకర సంఘటన సినీ రంగాన్ని శోకసముద్రంలో ముంచింది. పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’లో విలన్ గ్రూప్‌లో ఓ కీలక పాత్ర పోషించిన నటుడు నీరుడి వీరేష్ మృతి చెందారు.
నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని హనుమంతపూర్ గ్రామానికి చెందిన వీరేష్ (40) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదులో నివసిస్తూ, వివిధ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ జీవనం సాగించారు. అయితే, కొంతకాలం క్రితం ఆయనకు పెరాలసిస్ వ్యాధి సోకడంతో సినిమాలకు దూరమయ్యారు. దీంతో తన స్వగ్రామమైన హనుమంతపూర్‌కు తిరిగి వచ్చి అక్కడే ఉంటూ వచ్చారు. వ్యాధి తీవ్రతరం కావడంతో, ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు.
వీరేష్‌కు భార్య శిరీష ఉన్నారు. ఆయన మరణంతో హనుమంతపూర్ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వీరేష్ మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ‘గబ్బర్ సింగ్’ చిత్ర హీరో పవన్ కళ్యాణ్ కూడా స్పందించే అవకాశం ఉంది.