
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మాణంలో, రామ్ గోధల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. డైరెక్టర్ హరీష్ శంకర్, మారుతీ గెస్ట్ పాత్రల్లో కనిపించారు. అనిత హాసనందిని, అలీ, రవీంద్ర విజయ్, బబ్లూ పృథ్వీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూలై 11, 2025న థియేటర్లలో విడుదలైంది.
కథ :
చిన్నతనంలో తల్లి అనితను కోల్పోయిన సుహాస్, మేనమామ అలీ దగ్గర పెరుగుతాడు. ఓ యాక్సిడెంట్ సందర్భంగా సత్యభామ (మాళవిక మనోజ్) అతనికి పరిచయమవుతుంది. సత్యభామను ఇంటి వద్ద సురక్షితంగా దింపిన సుహాస్‌పై ఆమెకు ఇష్టం కలుగుతుంది. ఎంబీఏ చదువుతూ, అమ్మాయిలను పట్టించుకోని సుహాస్ కూడా సత్యభామను ఇష్టపడతాడు. కానీ, చిన్నప్పటి ఓ సంఘటన కారణంగా సుహాస్‌కు సినిమాలంటే ఇష్టం ఉండదు, నీళ్లంటే భయం. సత్యభామ, సుహాస్‌ను హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్పిస్తుంది. ఓ రోజు సుహాస్ తన తండ్రిని చూస్తాడు, అదే సమయంలో సత్యభామకు యాక్సిడెంట్ జరుగుతుంది. సత్యభామకు ఏమైంది? సుహాస్ చిన్నప్పుడు ఏం జరిగింది? సినిమాలు ఇష్టం లేని సుహాస్ డైరెక్టర్ అవుతాడా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన :
సుహాస్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. డ్యాన్సర్‌గా పరిచయమైన సుహాస్ ఈ చిత్రంలో ఓ పాటలో నృత్యంతో మెప్పించాడు. మలయాళ నటి మాళవిక మనోజ్ తెలుగులో అరంగేట్రంలోనే అందంగా కనిపిస్తూ, నటనతో ఆకట్టుకుంది. అలీకి చాన్నాళ్ల తర్వాత మంచి పాత్ర దక్కింది. సుహాస్ స్నేహితులుగా మోయిన్, సాత్విక్ ఆనంద్ పర్వాలేదనిపించారు. బబ్లూ పృథ్వీ హీరోయిన్ తండ్రిగా కొద్దిసేపు కనిపించాడు. అనిత హాసనందిని తల్లి పాత్రలో మెప్పించింది. హరీష్ శంకర్ తన వాస్తవ జీవిత పాత్రలోనే నటించాడు. మారుతీ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో సమర్థవంతంగా నటించారు.
సాంకేతిక విశ్లేషణ :
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఎడిటింగ్‌లో పునరావృత సన్నివేశాలను కత్తిరించి ఉంటే బాగుండేది. హీరోయిన్ డామినేటెడ్ పాత్రతో, సాధారణ కథనంతో ఈ చిత్రం రూపొందింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చిత్ర విశ్లేషణ :
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సుహాస్ ఈసారి కమర్షియల్ లవ్ స్టోరీతో వచ్చాడు. మొదటి భాగం సుహాస్ పాత్ర, అతని స్నేహితుల కామెడీ, హీరోయిన్ అతని చుట్టూ తిరగడంతో సాగుతుంది. సత్యభామ యాక్సిడెంట్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది. రెండో భాగంలో సుహాస్ బాల్యం, సినిమా పని, కొన్ని కామెడీ సన్నివేశాలతో కథ నడుస్తుంది.
కానీ సుహాస్ ఈ కథను ఎందుకు ఎంచుకున్నాడనే ప్రశ్న తలెత్తుతుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ తప్పింది. 25 ఏళ్ల క్రితం సన్నివేశాల్లో ఆధునిక టీవీలు, ఫ్రిడ్జ్‌లు చూపించడం లాజిక్ లోపంగా అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్, ఇంటర్‌కట్ సన్నివేశాలు పదేపదే కనిపించడం, ఒకే సన్నివేశాన్ని మళ్లీ చూపించడం ఆకట్టుకోలేదు. తల్లి సెంటిమెంట్ కొంత వరకూ పండినా, మేనమామ సెంటిమెంట్ బాగా కుదిరింది. అయితే, ఒక ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశం ఓవర్‌గా అనిపిస్తుంది. కామెడీ సన్నివేశాలు బలవంతంగా చొప్పించినట్లు అనిపిస్తాయి. చివర్లో సుహాస్ తండ్రి గురించి స్పష్టత ఇవ్వలేదు. క్లైమాక్స్‌లో ప్రేక్షకులను గందరగోళపరిచే ప్రయత్నం చేశారు. రెండో భాగంలో కొన్ని ట్విస్ట్‌లు ఉన్నా, అవి రొటీన్‌గానే ఉన్నాయి.
మొత్తంగా దర్శకుడు కొంత ఫిక్షన్ జోడించి. తన కథను సినిమాగా మలిచినట్లు అనిపిస్తుంది. సుహాస్, హీరోయిన్ హైదరాబాద్-వరంగల్ ట్రిప్స్ వేయడం గమనించదగ్గ అంశం.
సారాంశం:
తల్లి సెంటిమెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా రూపొందిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ ఆసక్తికరమైన చిత్రం.