‘VISA – వింటారా సరదాగా’ టీజర్ విడుదల

ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం ‘VISA – వింటారా సరదాగా’.

‘VISA – వింటారా సరదాగా’ టీజర్ ఆవిష్కరణ శనివారం(జూలై 12) ఉదయం జరిగింది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్ర టీజర్ అద్భుతంగా ఉంది. ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాలను చూపిస్తూ టీజర్ ఎంతో అందంగా సాగింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది. భావోద్వేగాలతో నిండిన ఓ మధుర ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామనే హామీని టీజర్ ఇచ్చింది.

‘VISA – వింటారా సరదాగా’ టీజర్ లో కథానాయకుడికి పాడ్‌కాస్టింగ్ అలవాటు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రకు మరియు ఆధునిక విద్యార్థి అనుభవాలకు అది కొత్తదనాన్ని తీసుకొచ్చింది.

ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరూ ఆయా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి టీజర్ కి అందాన్ని తీసుకొచ్చారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంటి నుండి దూరంగా జీవితాన్ని గడుపుతున్న ఒక తరం జీవితాలను ప్రతిబింబించేలా వీరి పాత్రలు ఉన్నాయి.

ఉద్భవ్ రఘు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ‘VISA – వింటారా సరదాగా’, తెలుగు సినిమాకు ఒక కొత్త స్వరాన్ని తీసుకువస్తుంది. ప్రేమ, హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఓ మంచి కథను ఈ తరం మెచ్చేలా తెరపైకి తీసుకొస్తున్నారు ఉద్భవ్.

సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ టీజర్‌ను
మరింత ఉన్నతంగా మలిచింది. హృదయాలను తాకే మధుర సంగీతానికి ఈ చిత్రం వేదిక కానుందని టీజర్ తోనే అర్థమవుతోంది.

అమెరికా నేపథ్యంలో గొప్ప నిర్మాణ విలువలు, సుందరమైన విజువల్స్ తో సాంకేతికంగా ఉన్నతమైన చిత్రాన్ని చూడబోతున్నాం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా వినోదాత్మక చిత్రంగా ‘VISA – వింటారా సరదాగా’ రూపుదిద్దుకుంటోంది.

‘VISA – వింటారా సరదాగా’ త్వరలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రయాణంలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి.

Related Articles

Latest Articles