
79వ స్వాతంత్య్ర దినోత్సవానికి సన్నద్ధమైన దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వతంత్ర ప్రజాస్వామ్య సౌధం మన దేశం. మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది అంటే ఆ త్యాగధనుల ఆత్మార్పణల ఫలితమే. దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలి. నుదిటి సిందూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించి, వారిని పెంచి పోషిస్తున్న ముష్కరులను అన్ని విధాలుగా కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. రక్షణ, అంతరిక్ష రంగాల్లో అభేద్యమైన స్థాయికి మన భారత దేశం చేరుతున్నందుకు ప్రతి ఒక్కరం గర్విద్దాము. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దృఢ నాయకత్వంలో రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉంటూ… అంతర్జాతీయంగా మూడో స్థానానికి చేరువయ్యాము. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండటం మన బాధ్యత.


