
తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు అభినందనీయమని, ఈ దిశగా సినీ పరిశ్రమ ఐక్యంగా ముందుకు సాగుతోందని నిర్మాత శ్రీ దిల్ రాజు పేర్కొన్నారు.
ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వల్లభనేని అనిల్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కొన్ని షరతులకు ఒప్పుకుని మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫెడరేషన్ నాయకులు పరిస్థితులను అర్థం చేసుకుని సహకరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
ప్రముఖ నటుడు శ్రీ చిరంజీవి, సినీ పరిశ్రమలోని సమస్యలను వేగంగా పరిష్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా మార్చాలన్న సీఎం ఆలోచనలు హర్షణీయమని, తెలుగు చిత్రసీమ ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి చేస్తున్న కృషిని సినీ ప్రముఖులు ఏకగ్రీవంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా, సినీ పరిశ్రమ ప్రతినిధులు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ హైదరాబాద్‌ను ప్రపంచ సినిమా కేంద్రంగా నిలపడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


