
తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు ప్రధాన మూవీ పైరసీ గ్యాంగ్ లను పట్టుకున్నారు, ఈ సిండికేట్స్ లో ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మొదటి గ్యాంగ్ థియేటర్లో మూవీస్ ని దొంగతనంగా కెమెరాతో చిత్రీకరించి పైరసీ వెబ్సైట్లలలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ ముఠా గత 18 నెలల్లో 40కి పైగా తెలుగు, హిందీ, తమిళ చిత్రాలను విడుదలైన రోజునే అక్రమంగా లీక్ చేసి, క్రిప్టో కరెన్సీ ద్వారా భారీగా వ్యాపారం నడిపినట్లు తెలిసింది.
ఇంకా రెండవ గ్యాంగ్ యొక్క మోడస్ ఓపరండీ డైరెక్ట్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ని హాక్ చేసి అక్కడ నుండి HD క్వాలిటీ సినిమాలు దొంగలించి సినిమా రిలీజ్ కన్నా ముందుగా లేదా రిలీజ్ అయిన వెంటనే HD క్వాలిటీ ప్రింట్స్ పేరుతో వెబ్‌సైట్స్ లో అప్లోడ్ చేయడం. ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు అశ్విని కుమార్ (21 సంవత్సరాల వయస్సు). ఇతను డిజిటల్ సినిమా సర్వీస్ ప్రొవైడర్స్ ని హ్యాక్ చేసి అక్కడి నుండి మూవీస్ దొంగలించి పైరసీ వెబ్సైట్లకు విక్రయిస్తూ ఉంటాడు. తను కేవలం మూవీ పైరసీ నే కాదు, బీహార్ రాష్ట్ర గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ని, లా డిపార్ట్మెంట్ వెబ్‌సైట్స్ ని మరియు చాలా పెద్ద పెద్ద ప్రైవేట్ వెబ్సైట్లను కూడా హాక్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ పైరసీ కార్యకలాపాల వల్ల భారతీయ సినీ పరిశ్రమకు సుమారు రూ.22 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.
అందులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్)కు మాత్రమే రూ.3,700 కోట్ల నష్టం సంభవించినట్లు అంచనా. ఈ గ్యాంగ్ సినిమాలను అక్రమంగా డౌన్లోడ్ చేయడానికి వివిధ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానెల్స్‌ను ఉపయోగించి, క్రిప్టో పేమెంట్ల ద్వారా లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.సైబర్ క్రైమ్ విభాగం ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ ముఠాను పట్టుకుంది. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితులు సినిమా థియేటర్లలో రహస్యంగా రికార్డింగ్‌లు చేసి, వాటిని ఆన్లైన్లో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది, మరియు పైరసీని అరికట్టడానికి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.పోలీసులు ఈ ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు, మరియు ఇతర సభ్యులను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ఈ ఘటన, డిజిటల్ యుగంలో పైరసీ నియంత్రణకు సంబంధించిన సవాళ్లను మరోసారి హైలైట్ చేసింది.