
తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. కార్మికశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో తెలుగు సినీ పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతలు మరియు ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉన్నారు. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
కమిటీ రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీ ఛైర్మన్‌గా కార్మికశాఖ కమిషనర్, సభ్య కన్వినర్‌గా అదనపు కమిషనర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఫిల్మ్ ఛాంబర్ నుంచి దామోదర్ ప్రసాద్, మలమంచిలి సుప్రియ, ఉద్యోగుల సమైక్య నుంచి వల్లభనేని అనిల్, అమ్మిరాజు కానుమిల్లి ఉన్నారు. ఈ చర్యతో సినీ కార్మికుల సమస్యలు త్వరలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది.