సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఎంవీ రఘు 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్

లెజెండరీ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ ఎంవీ రఘు ఇండియన్ సినిమా పరిశ్రమలో 50 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థాన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంవీ రఘు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 1974లో కెరీర్ మొదలుపెట్టిన ఎంవీ రఘు, కళ్లు రఘుగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాటోగ్రాఫర్ గా స్వాతిముత్యం, సిరివెన్నెల, సితార, అన్వేషణ వంటి చిత్రాలు ఆల్ టైమ్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఎంవీ రఘు రూపొందించిన కళ్లు సినిమా ఆయనకు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డ్ తో పాటు నాలుగు నంది అవార్డ్స్ తీసుకొచ్చింది. ఎంవీ రఘు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో

నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – సినీ పరిశ్రమలో ఎంవీ రఘు గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం సంతోషకరం. ఆయన ఎందరో గొప్ప దర్శకులతో, టెక్నీషియన్స్ తో కలిసి పనిచేశారు. సితార సినిమాలో మహల్లో పగిలిన గాజు ముక్కలో హీరోయిన్ భాను ప్రియ కళ్లను చూపించే సీన్ నాకు చాలా ఇష్టం. సినిమాటోగ్రాఫర్ గా రఘు క్రియేటివిటీకి ఆ సీన్ తార్కాణం. ఆ ఇష్టంతో నేను కట్టుకున్న ఇంట్లో అలాంటి అద్దాలను అమర్చుకున్నాను. రఘు టెక్నీషియన్ గా ఇప్పటికీ అదే స్పిరిట్ తో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ రోజు ఈ ఈవెంట్ కు కేవలం రఘు మీద అభిమానంతోనే వచ్చాను. అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ – నేను సితార సినిమాలో హీరోగా సెలెక్ట్ కావడానికి ఒక కారణం రఘు గారు. సితార సినిమాకు పనిచేసిన ముగ్గురు గ్రేట్ టెక్నీషియన్స్ వంశీ, ఇళయరాజా, ఎంవీ రఘు. ఆయన ఫిలిం ఇండస్ట్రీకి చేసిన కాంట్రిబ్యూషన్ అద్భుతం. ఎంవీ రఘు గారితో అమెరికా అల్లుడు అనే మూవీ చేశాను. ఆ సినిమా చిత్రీకరణ టైమ్ లో నాకు సినిమాటోగ్రఫీ కూడా నేర్పించారు. ఇతర పనుల్లో బిజీగా ఉన్నా మేమంతా రఘు గారి మీద అభిమానంతో ఆయనను అభినందించాలని ఇక్కడికి వచ్చాం. అన్నారు.

నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ – చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్టిస్టులు ఉన్నారేమో గానీ టెక్నీషియన్స్ ఉండటం చాలా అరుదు. ఎంవీ రఘు విజయ బాపినీడు, విశ్వనాథ్ గారు వంటి ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేశాడు. ఎంతోమంది గొప్ప హీరోలతో వర్క్ చేశాడు. ఆయన తొలినాళ్లలో ఎంత వినయంగా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారు. సినిమాటోగ్రఫీలో తనకున్న అనుభవాన్ని ఫిలిం ఇనిస్టిట్యూట్ ద్వారా ఇప్పటి తరానికి నేర్పుతుండటం అభినందనీయం. చిత్ర పరిశ్రమకు ఎన్నో అవార్డ్స్ సాధించిన టెక్నీషియన్ రఘుకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు మాట్లాడుతూ – సినిమాటోగ్రఫీలో నా గురువులు వీఎస్ఆర్ స్వామి, గోపాల్ రెడ్డి, ఎంవీ రఘు గారు. సితార సినిమాకు ఆయన ఇచ్చిన విజువల్స్ అద్భుతం. అన్వేషణ సినిమా థియేటర్ లో చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు కెమెరా పనితనం గురించి మాట్లాడుతుండటం చూసి ఆశ్చర్యపోయాను. నేను సినిమాటోగ్రాఫర్ అయితే నా గురించి ఇలా ప్రేక్షకులు మాట్లాడుకుంటారా అనుకున్నాను. ఎంవీ రఘు గారు 50 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకోవడం సంతోషకరం. ఆయన దగ్గర శిష్యరికం పొందుతున్న వారంతా అదృష్టవంతులు. అన్నారు.

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ – ఎంవీ రఘు గారు గ్రేట్ టెక్నీషియన్. ఆయన సిరివెన్నెల, ఆలాపన వంటి ఎన్నో గొప్ప చిత్రాలను తన కెమెరా కన్నుతో చూపించారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. ప్రకృతిలోని ప్రతి అందాన్ని ఎంతో ఒరిజినల్ గా కెమెరాలో బంధించారు. తెరపై ఎంత గొప్ప నటుడిని చూపించాలన్నా అది సినిమాటోగ్రాఫర్ వల్లే సాధ్యం. ఎంవీ రఘు గారు ఇప్పటికీ ఎంతోమంది పిల్లలకు సినిమాటోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా ఎంవీ రఘు గారికి నా విశెస్ అందిస్తున్నా. అన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – ఇవాళ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఎంతోమంది నటీనటులకు గురువు ఎంవీ రఘు గారు. నా గురువు ఆయనే. కళ్లు సినిమాతో నాకు గుర్తింపు ఇచ్చారు. ఆ తర్వాత వందల సినిమాల్లో నటించగలిగాను. రఘు గారు ఇలాగే మరెంతో కాలం పనిచేస్తూ ఎంతోమంది శిష్యులకు శిక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఎంవీ రఘు మాట్లాడుతూ – నా 50 ఏళ్ల కెరీర్ లో ఎంతోమంది గొప్ప గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది. లవకుశ సినిమాటోగ్రాఫర్ పీఎల్ రాయ్, మాయాబజార్ రూపొందించిన మార్కస్ బార్ ట్లే గార్లతో వర్క్ చేశాను. నా గురువు వీఎస్ఆర్ స్వామి గారితో ఆ తర్వాత గోపాల్ రెడ్డి గారితో పనిచేశాను. ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా ఎంతోమంది దిగ్గజాలతో పనిచేసే అదృష్టం దక్కింది. వీళ్లతో పాటు ఈ వేదిక మీద ఉన్న వాళ్లంతా నా ప్రయాణానికి కారణం. ఏదైనా మంచి విజువల్ ఇస్తే చాలా బాగుంది అని ప్రోత్సహించిన వారే. వారి ప్రోత్సాహం వల్లే నేను గొప్ప పేరు తెచ్చుకోగలిగాను. నేను పని రాక్షసుడిని. ఏదైనా సరిగ్గా రాకుంటే రాజీ పడను. విశ్వనాథ్ గారితో రెండు చిత్రాలు స్వాతిముత్యం, సిరివెన్నెలకు పనిచేశాను. మన దేశం నుంచి ఆస్కార్ కు వెళ్లిన ఒకే చిత్రం స్వాతిముత్యంకు నేను సినిమాటోగ్రాఫర్ ను. రెండేళ్ల కిందట ఆస్కార్ కమిటీలో మెంబర్ ను. మా ఇనిస్టిట్యూట్ ఉదయ్ కిరణ్ గారి వల్లే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఎంతోమంది ఈతరం పిల్లలకు సినిమాటోగ్రఫీలో శిక్షణ ఇస్తుండటం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ వంశీ వస్తే బాగుండేది. సినిమాటోగ్రాఫర్ గా నేను ఏదైనా సాధించాను అంటే అందులో వంశీ పాత్ర కీలకం. అన్నారు. ఈ కార్యక్రమంలో నటి అన్నపూర్ణ, సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి, పీజీ విందా, దర్శకుడు వీరశంకర్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles