



ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ, మనవరాలు నందమూరి మోహన రూపా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు చేతుల మీదగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే పత్తికొండ నియోజకవర్గం లో మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానందించి తన చేతుల మీదగా నాన్నగారి విగ్రహం ఆవిష్కరించిన పత్తికొండ శాసనసభ్యులు శ్యామ్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాయలసీమకు మా నాన్నగారు ఎంతో చేశారు. సాగునీరు ద్వారా ఇక్కడ భూమిని సాగు చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. రాయలసీమలో ఆయనకు అభిమానులు ఎక్కువ. కృతజ్ఞతా భావంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నాన్నగారు ఎంతో మేలు చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకుగాను శ్యాం గారికి, తెలుగుదేశం కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు ధన్యవాదాలు అనుకుంటున్నాను” అన్నారు.

ఎన్టీఆర్ మనవరాలు నందమూరి మోహన్ రావు గారు మాట్లాడుతూ… “ఈరోజు మా తాతగారు నందమూరి తారకరామారావు గారి విగ్రహ ఆవిష్కరణకు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సస్యశ్యామలమైన రాయలసీమ గడ్డమీద మేము అడుగు పెట్టే అదృష్టం కలిగించినందుకు పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు.
పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్యాం బాబు గారు మాట్లాడుతూ… “ఈరోజు చాలా శుభదినం. మన ప్రభుత్వం స్థాపించిన తర్వాత నా చేతుల మీదగా, పెద్దలు నందమూరి మోహనకృష్ణ, నందమూరి మోహన రూప గారి చేతుల మీదగా నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాము. బీసీలకు రాజకీయ మనుగడ ఉందంటే దానికి కారణం రామారావు గారు. ఆయన విగ్రహాలను ప్రతి ఒక్క ఊరిలో ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. మా క్యాడర్ సపోర్ట్ తో మరిన్ని విగ్రహావిష్కరణలను చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.


