
యంగ్ అండ్ డైనమిక్, మా రాముడు అందరివాడు మూవీస్ లో నటిస్తూ బిజీగా ఈ ఏడాది టాలీవుడ్ లో బిజీగా గడిపారు యంగ్ హీరో శ్రీరామ్. ఆయన నటించిన ఈ రెండు చిత్రాలు కొత్త సంవత్సరం 2026లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని కొత్త మూవీస్ ను కూడా ఆయన అనౌన్స్ చేయబోతున్నారు. ఆ చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ చిత్రాల విశేషాలు తెలియజేస్తూ న్యూ ఇయర్ సందర్భంగా హీరో శ్రీరామ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
మీ నేపథ్యం గురించి చెప్పండి ?
మాది నెల్లూరు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని. ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాడిని. చిరంజీవి గారి సినిమాలు చూసిన స్ఫూర్తితో చిత్ర పరిశ్రమలోకి రావాలనే కోరిక కలిగింది. అలా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాను.
ఇండస్ట్రీలో ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా ?, బ్యాక్ గ్రౌండ్ ఉందా ?
నాకు ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేరు. గతంలో నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. నా కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని టాలీవుడ్ కు వచ్చాను. శ్రీరామ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నేనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాను. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే కొత్త వారమైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో సినిమాలు చేస్తున్నా.
ఈ ఏడాది బిజీగా ఉన్నట్లున్నారు. 2025 మీకు ఎలా గడిచింది ?
ఈ ఏడాది ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నాను. రెండు సినిమాలు కంప్లీట్ చేయడంతో పాటు కొత్త సినిమాల స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్నాము. ఆ సినిమాల వివరాలు త్వరలో వెల్లడిస్తా. 2025 లో మా రాముడు అందరివాడు, యంగ్ అండ్ డైనమిక్ మూవీస్ నటించాను. ఆ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి. కొత్త ఏడాదిలో ఈ రెండు చిత్రాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
యంగ్ అండ్ డైనమిక్, మా రాముడు అందరివాడు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి?
సకుటుంబంగా ప్రేక్షకులంతా చూసే సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం. మన గ్రామీణ నేపథ్యంతో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ కథాంశాలతో మన నేటివిటీ ఉండేలా యంగ్ అండ్ డైనమిక్, మా రాముడు అందరివాడు చిత్రాలు చేశాం. ఈ రెండు చిత్రాలు ఆకట్టుకుంటాయి.
మీ సినిమాల్లో మ్యూజిక్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది ?
మ్యూజిక్ మా సినిమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా రాముడు అందరివాడు సినిమాలో గీతా మాధురి, నల్లగొండ గద్దర్ అన్న..ఇలా పేరున్న సింగర్స్ పాటలు పాడారు. మా మూవీ లిరికల్ సాంగ్స్ కు 7 లక్షలకు పైగా వ్యూస్ రావడం హ్యాపీగా ఉంది.
మల్టీస్టారర్ మూవీస్ చేస్తారా ?
నాకు సోలో హీరోగానే కాకుండా మరో హీరోతో కలిసి నటించడం కూడా ఇష్టమే. అలాంటి మంచి ప్రాజెక్ట్స్ వస్తే తప్పకుండా మరో హీరోతో కలిసి నటిస్తా. పెద్ద హీరోలతో అవకాశం వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది.
హీరోగానే నటిస్తారా లేక ఏదైనా మంచి విలన్ రోల్ వస్తే నటిస్తారా ?
హీరోగానే కంటిన్యూ కావాలని లేదు. అవకాశం వస్తే పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్లలో కూడా నటించాలని ఉంది. ఏ క్యారెక్టర్ చేసినా నటుడిగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అంతే.
సంక్రాంతికి ఎక్కువగా సినిమాలు చూస్తుంటారా ?
అవును, నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు సంక్రాంతికి పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. థియేటర్స్ లో మూవీస్ ను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. ఈ సంక్రాంతికి కూడా ప్రభాస్ గారి రాజా సాబ్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత చిరంజీవి గారి మన శంకరవరప్రసాద్ రిలీజ్ కు వస్తోంది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలన్నింటికీ రిలీజ్ డేట్స్ గ్యాప్ ఉంది కాబట్టి అన్ని సినిమాలనూ ప్రేక్షకులు ఆదరిస్తారు.
ఈ మధ్య నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ మీద కామెంట్స్ చేశాడు, ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి
నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్చ మహిళలకు ఉంది. వాళ్లు ఎలా ఉండాలో చెప్పే హక్కు మనకు లేదు. ఇటీవల మంచి మూవీస్ తో పేరు తెచ్చుకుంటున్న శివాజీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మన పని మనం చూసుకుంటే ఏ గొడవా ఉండదు. కుటుంబ సభ్యులే మన మాట వినని రోజులు ఇవి. అలాంటివి మరొకరికి మనం చెప్పడం ఎందుకు
చివరగా ప్రేక్షకులకు ఏం చెప్పాలనకుంటున్నారు.
కంటెంట్ బాగుంటే ఎవరి సినిమా అయినా ఆదిరించే గొప్ప మనసున్న తెలుగు ప్రేక్షకులకు న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ శ్రీరామ్.


