
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ చేపట్టిన తిరుమల పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. దాదాపు 23 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో ఆయన కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు. కాలినడక మార్గంలోని చివరి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి, శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేసి తన మొక్కును చెల్లించుకున్నారు.
యాత్ర ముగిసిన అనంతరం బండ్ల గణేశ్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను బలంగా కోరుకున్న కోరిక నెరవేరడంతోనే స్వామివారికి ఈ మొక్కు తీర్చుకున్నానని స్పష్టం చేశారు.
“నిజాయితీగా నేను కోరుకున్న కోరికను స్వామివారు ఆలకించారు. అందుకే 23 రోజుల పాటు ఎండ, వాన అని చూడకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి సన్నిధికి చేరగలిగాను. ఇది నా జీవితంలో ఒక అద్భుత ఘట్టం,” అని ఆయన పేర్కొన్నారు. తన సంకల్పం నెరవేరినందుకు, యాత్ర నిర్విఘ్నంగా సాగినందుకు శ్రీవేంకటేశ్వర స్వామికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


