
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో, తన కూతురు ఐశ్వర్య అర్జున్‌ను కథానాయికగా, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ‘సీతా పయనం’. సత్యరాజ్, అర్జున్ సర్జా, ధృవ్ సర్జా, ప్రకాష్ రాజ్, బిత్తిరి సత్తి తదితరులు కీలకపాత్రలో పోషించిన చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
సీత (ఐశ్వర్య అర్జున్) తల్లి లేని అమ్మాయి. తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్య రాజ్) ఆమెను అల్లారుముద్దుగా పెంచుతాడు. తండ్రే లోకంగా బతికే సీతకు పెళ్లి అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. ఒక పని మీద వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆ ప్రయాణంలో ఆమెకు అభి (నిరంజన్) పరిచయం అవుతాడు. ఈ జర్నీలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు సీత ఆలోచనా విధానాన్ని ఎలా మార్చాయి? ఈ కథలో గిరి (అర్జున్ సర్జా), బసవన్న (ధృవ్ సర్జా) పాత్రల ప్రాముఖ్యత ఏంటి? చివరకు సీత తన పయనాన్ని ఎలా ముగించింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
సీత పాత్రకు ఐశ్వర్య పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఐశ్వర్యని కాకుండా ప్రేక్షకులంతా సీతని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఇక ఆమె ఆహార్యం, హావభావాలు, మాట తీరు అన్నీ కూడా ఆడియెన్స్‌ని ప్రేమలో పడేస్తాయి. ఆమెని చూస్తే ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. అంతలా ఆడియెన్స్‌ని కట్టి పడేస్తుంది. ఇక నిరంజన్ కూడా మన ఇంటి అబ్బాయిలానే, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్‌కి ఇలాంటి పాత్రలు అలవాటే. ఆయన నటనకు వంక పెట్టడానికి లేదు. ఇక సత్యా రాజ్ తండ్రి కారెక్టర్‌లో మరోసారి అందరినీ మెప్పించేశాడు. బిత్తిరి సత్తి రెండు, మూడు చోట్ల కనిపించి, నవ్విస్తాడు. అర్జున్ సర్జా ఎంట్రీకి థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి. ధృవ్ సర్జా బ్లాక్, అక్కడ చెప్పిన సందేశం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మిగిలిన పాత్రధారులందరూ కూడా తమకు ఇచ్చిన కారెక్టర్‌కు న్యాయం చేసినట్టు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడిగా అర్జున్ మరోసారి తన అభిరుచిని చాటుకున్నారు. కొత్త కథ కాకపోయినా, బలమైన ఎమోషన్స్‌తో కథనాన్ని నడిపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది, పాటల కంటే నేపథ్య సంగీతం (BGM) సన్నివేశాలకు ప్రాణం పోసింది. మాటల రచయిత పనితనం బాగుంది, ముఖ్యంగా బంధాల గురించి వచ్చే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కుదిరాయి.
ప్లస్ పాయింట్స్ :
ఐశ్వర్య అర్జున్ నటన, సెంటిమెంట్ & ఎమోషన్స్, అతిథి పాత్రలు, విలువలతో కూడిన కథ, నిర్మాణ విలువలు.
మైనస్ పాయింట్స్ :
స్లో నెరేషన్, ట్విస్టులు లేకపోవడం.
సారాంశం:
‘సీతా పయనం’ ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం. కుటుంబంతో కలిసి చూడదగ్గ మంచి చిత్రం.


