‘తండేల్’లో అద్భుత నటనకు.. ఉత్తమ నటుడిగా నాగ చైతన్యకు ‘తెలంగాణ గద్దర్ అవార్డు’

​’తండేల్’ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను అక్కినేని నాగ చైతన్య ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’లో ప్రతిష్టాత్మక ‘ఉత్తమ నటుడు’ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలో ఆయన కనబరిచిన భావోద్వేగభరితమైన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి.

​ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి చైతన్య.. ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించి వారి జీవనశైలిని, బాడీ లాంగ్వేజ్‌ని దగ్గరుండి గమనించారు. ఆ పాత్రకు తగ్గట్టుగా తన దేహదారుఢ్యాన్ని, ఆహార్యాన్ని మార్చుకుని తన కెరీర్‌లోనే అత్యంత సహజమైన, పవర్‌ఫుల్ నటనను కనబరిచారు.

​ఈ అవార్డు రావడం పట్ల నాగ చైతన్య స్పందిస్తూ.. “తండేల్ నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడి అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథను ప్రాణం పెట్టి తెరకెక్కించిన మా చిత్ర బృందానికే ఈ విజయం దక్కుతుంది” అని హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి చేస్తున్న కృషిని, ప్రతిభను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles