
ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల వ్యవసాయ భూమి కొనుగోలు వ్యవహారంలో మోసానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ఇతరులకు చెందిన భూమిని శ్రీను వైట్లకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ భూమిగా చూపిస్తూ ఆ స్థలాన్ని విక్రయించగా, దీనికి సంబంధించి శ్రీను వైట్ల సుమారు రూ. కోటి వరకు చెల్లించినట్లు సమాచారం.
అయితే ఇటీవల కోర్టు విచారణలో ఆ భూమి వేరే వ్యక్తులకు చెందినదని తేలడంతో అసలు విషయం బయటపడింది. దీంతో తమను మోసం చేసి ఇతరుల స్థలాన్ని అమ్మినట్లు గుర్తించిన శ్రీను వైట్ల ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
ఈ ఘటనపై దర్శకుడు శ్రీను వైట్ల హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసం వెనుక మరెవరు ఉన్నారనే దానిపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


