‘జెట్టి’ సినిమా హీరోపై ఆరోపణలు చేస్తూ చిత్తూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం

​చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ‘జెట్టి’ సినిమా హీరో మాన్యం మురళీకృష్ణ తనను ఆర్థికంగా దారుణంగా మోసం చేశాడంటూ, చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించాడు.

రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి హీరో మురళీకృష్ణ తన వద్ద నుంచి సుమారు రూ. 3.15 కోట్లు వసూలు చేసి, మోసానికి పాల్పడ్డాడని బాధితుడు లోకేష్ తన సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు. హీరోకు డబ్బులు ఇవ్వడం కోసం తన ఇంటిని తాకట్టు పెట్టడమే కాకుండా, బంధువుల వద్ద భారీగా అప్పులు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తీరా మోసపోయానని గ్రహించి, కనీసం ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.20 లక్షలు ఇవ్వాలని బతిమాలినా హీరో పట్టించుకోలేదని వాపోయాడు. “అమ్మానాన్న నన్ను క్షమించండి” అంటూ లేఖలో కన్నీటి పర్యంతమయ్యాడు.

ఆత్మహత్యాయత్నం చేసిన లోకేష్‌ను చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పుల పాలై మోసపోయిన తనకు న్యాయం చేయాలని, అధికారులే తన కుటుంబాన్ని ఆదుకోవాలని లోకేష్ వేడుకుంటున్నాడు.

Related Articles

Latest Articles