
నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ మ్యాడ్ నెస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘రాకాస’ కోసం షూటింగ్ చేసిన దాని కంటే ప్రమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాం. మేం మంచి సినిమాని తీశాం. మేం తీసిన మూవీని జనాల వరకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ఈ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నాం. గ్లింప్స్ నుంచే ‘రాకాస’ మీద భారీ హైప్ ఏర్పడింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా, ఎంటర్టైన్ అయ్యేలా మా ‘రాకాస’ ఉంటుంది. మా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. పూర్తిగా హారర్, థ్రిల్లర్ అని కాకుండా.. కామెడీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల అంశాలతో ఉంటుంది. అనుకున్న బడ్జెట్‌లోనే మూవీని తీశాం. కానీ సమ్మెలాంటి కారణాలతో ఆర్టిస్టుల డేట్స్ కొన్ని సమస్యలు వచ్చాయి. సోషల్ మీడియాని వాడని రామ్ చరణ్ అన్న దగ్గరకే మా ‘రాకాస’ రీచ్ అయిందంటే మా మూవీ జనాల వరకు వెళ్లిందని నాకు అర్థమైంది. నాకు ఎప్పుడూ కూడా డిఫరెంట్ జానర్‌లో సినిమాలు తీయాలని ఉంటుంది. కానీ ఏ జానర్‌లో మూవీ తీసినా కూడా అందులో ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ ఉండాలని అనుకుంటాను. ‘రాకాస’లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’ అని అన్నారు.
సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ గురించి రామ్ చరణ్ గారు చాలా గొప్పగా మాట్లాడారు. రామ్ చరణ్ గారిని కలుస్తున్నాం అని నిహారిక గారు చెప్పినప్పుడు నమ్మలేదు. నాతో ప్రాంక్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. మాకున్న పరిధిలో ఇండియానా జోన్స్ లాంటి అడ్వంచెర్ ఒకటి చేశాం. అలాంటి హాలీవుడ్‌తో పోల్చకండి. మా సినిమా నుంచి పూర్తి వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. మానస గారు నాకు ముందు ఈ కథను చెప్పారు. ఆ తరువాత కథలు వినడం ఆపేసి ఈ ప్రాజెక్టుకే ఓకే చెప్పేశాను. పూర్తి కథ సెట్ అయ్యాక నిహారిక గారి వద్దకు వెళ్లాం. ఆమె ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాక అన్నీ చకచకా జరిగిపోయాయి. నిహారిక గారు, మానస గారితో నాకు చాలా ఏళ్ల్ నుంచి మంచి బంధం ఉంది. వాళ్లతో నాకు చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. నా అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని స్వేచ్చగా వారితో పంచుకుంటాను. ‘రాకాస’ కచ్చితంగా అందరినీ అలరిస్తుంది’ అని అన్నారు.
మానస శర్మ మాట్లాడుతూ ..‘‘రాకాస’లో కథ చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పిల్లలను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మన జానపదాలు, కల్చర్ అనేవి ఈ తరానికి అర్థమయ్యేలా, నచ్చేలా ఈ మూవీని తీశాం. టెక్నాలజీని వాడుకుని ‘రాకాస’ని అద్భుతంగా తెరకెక్కించాం. కుటుంబమంతా కలిసి ఓ అందమైన చందమామ కథను చూసి ఎంటర్టైన్ అయ్యేలా ‘రాకాస’ ఉంటుంది’ అని అన్నారు.
నయన్ సారిక మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నాకు హోం బ్యానర్‌లాంటిది. నిహారిక గారు తీసిన వెబ్ సిరీస్‌తోనే నా జర్నీ ప్రారంభమైంది. మానసతో నాకు ఇది రెండో ప్రాజెక్ట్. ‘రాకాస’ నా కెరీర్‌లో స్పెషల్‌గా నిలుస్తుంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్ గారిని కలవడం ఆనందంగా ఉంది. ఆయనకు నేను వీరాభిమానిని. ఆయన్ను కలిసిన తరువాత నాకు కన్నీళ్లు ఆగలేదు. మా ‘రాకాస’ గురించి ఆయన మాట్లాడటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
మన్యం రమేష్ మాట్లాడుతూ .. ‘ఈ మధ్య కాలంలో సినిమా తీయడం కంటే జనాల వరకు రీచ్ చేయడమే కష్టంగా మారింది. ‘రాకాస’ని మా ప్రమోషన్స్‌తో ఆడియెన్స్ వరకు రీచ్ అయ్యేలా చేయగలిగాం. షూటింగ్ 55 రోజులు చేస్తే.. ప్రమోషన్స్ 60 రోజులు చేశాం. విడుదలకు ముందే అన్ని బిజినెస్‌లు పూర్తయ్యాయి. మా కంటెంట్ మీదున్న నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాని కొన్నారు. టీం అంతా చాలా కష్టపడింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.
జీ స్టూడియో కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య మాట్లాడుతూ .. ‘‘రాకాస’ కథ అద్భుతంగా ఉంటుంది. నిహారిక, రమేష్ గారి వల్ల మాకు కూడా కాన్ఫిడెంట్ పెరిగింది. సంగీత్ శోభన్, నయన్ అద్భుతంగా నటించారు. ‘రాకాస’ థియేటర్లో పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.


