
జో శర్మ, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (Motive for Murder)’ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. సినిమాకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో జో శర్మ, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించి, నిర్మించారు. శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, పసునూరి శ్రీనివాస్, గీత భాస్కర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. సంతోష్ శానమోని చిన్న ఫోటోగ్రఫీ చేయగా ఆనంద్ పవన్ ఎడిటింగ్ చేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఏసీపీ కృష్ణ (సంబీత్ ఆచార్య), జర్నలిస్ట్ రాధ (జో శర్మ) ఇద్దరూ భార్యాభర్తలు. హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ స్టార్ హీరో దారుణంగా హత్యకు గురవుతాడు. అయితే, హంతకుడు ఆ హీరో శవాన్ని మామూలుగా వదిలేయకుండా ‘డెత్ ఆఫ్ గ్లాడియేటర్’ (జీన్ సైమన్ గీసిన ప్రసిద్ధ చిత్రం) అనే పెయింటింగ్‌లో ఉన్నట్లుగా విచిత్రమైన భంగిమలో అమర్చుతాడు.
ఈ క్లిష్టమైన కేసును ఛేదించే బాధ్యతను ప్రభుత్వం ఏసీపీ కృష్ణకు అప్పగిస్తుంది. కృష్ణ దర్యాప్తు మొదలుపెట్టాక ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. గత ఐదేళ్లలో అచ్చం ఇలాగే దాదాపు 20కి పైగా హత్యలు జరిగాయని అతనికి అర్థమవుతుంది. ఒక సైకో కిల్లర్ ఈ వరుస హత్యలు ఎందుకు చేస్తున్నాడు?అతని అసలు ఉద్దేశం ఏంటి? ఈ దారుణాల్లో అతనికి ఎవరెవరు సాయం చేశారు? జర్నలిస్ట్ అయిన తన భార్య రాధ సాయంతో ఏసీపీ కృష్ణ ఆ సీరియల్ కిల్లర్‌ను చివరకు ఎలా పట్టుకున్నాడు? అన్నదే ఈ మిగతా సినిమా కథ.
నటీనటుల నటన :
జో శర్మ : ఈమెకు ఇది మొదటి సినిమా అయినా, చాలా అనుభవం ఉన్న నటిలా అద్భుతంగా నటించింది. అంతేకాకుండా, ఈమె ఈ చిత్ర నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉంది.
సంబీత్ ఆచార్య : హీరోగా ఇతనికి కూడా ఇదే తొలి సినిమా.
ఇతర నటులు : అనుభవజ్ఞులైన శుభలేఖ సుధాకర్, ఎం.ఆర్.సి. వడ్లపట్ల, రాజేష్ మాత్రే మరియు గీతా భాస్కర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
చిత్ర విశ్లేషణ :
సీరియల్ కిల్లర్ కథలు, ఏదైనా పుస్తకాన్ని కాపీ కొట్టి హత్యలు చేయడం లాంటివి మనం ఎప్పట్నుంచో చూస్తున్నవే. కానీ… శవాలను ప్రసిద్ధ “పెయింటింగ్స్” భంగిమలో వదిలేయడం, దాని ద్వారా పోలీసులు దర్యాప్తు చేయడం అనే పాయింట్ మాత్రం ఈ సినిమాలో చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టదు. “తర్వాత ఏం జరుగుతుంది?” అనే ఉత్కంఠను (సస్పెన్స్‌ను) దర్శకుడు చివరి దాకా బాగా మెయింటైన్ చేశాడు. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో తీశారు. నిర్మాణ విలువల పరంగా ఉన్న ఆ లోపం మాత్రం స్క్రీన్ మీద మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
సంగీతం & కెమెరా : వసంత్ ఇసైపెట్టై అందించిన సంగీతం, సంతోష్ షణ్మోని సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా కుదిరాయి.
దర్శకత్వం : ‘మల్లెపువ్వు’, ‘మెంటల్ కృష్ణ’ వంటి సినిమాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆయన మొదటి ప్రయత్నం మెప్పించేలా ఉంది.
సారాంశం : మీకు సైకలాజికల్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు ఇష్టమైతే.. ఈ సినిమా మీకు కచ్చితంగా ఒక మోస్తరుగా నచ్చుతుంది.


