
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వీరు వులవల రచన దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మాతగా బత్తుల సరస్వతి సమర్పణలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాగా సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. విటివి గణేష్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అనంత్ శ్రీరామ్, కాకినాడ నాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రవణ్ భార్గవ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేయగా కోటి ఎడిటింగ్ చేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
గోవింద్ (పవన్ కళ్యాణ్), కమల (రాయంచ) ఒక జంటగా, శ్రీను (కసిరెడ్డి), గీత (విషిక) ఒక జంటగా, సత్తి (సప్తగిరి),లక్ష్మీ (హాసిని సుధీర్) మరో జంటగా కనిపించారు. చిన్నప్పటి నుంచీ పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్. వీరితో పాటు క్రియేటివ్ కిస్సు (వెన్నెల కిషోర్) కూడా బాల్య స్నేహితుడే. ఈ ముగ్గురూ కూడా పెళ్లైన ఏడాదికే విడాకులు అంటూ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న రాయంచ , తన భర్త శ్రీనుకి ఉన్న సమస్యని తెలుసుకుని పెళ్లి చేసుకున్న విశిక, బిజినెస్‌లో మొత్తం కోల్పోయినా కూడా సప్తగిరిని విడిచి పెట్టని హాసిని సుధీర్ ఎందుకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవుతారు? అసలు ఈ మూడు జంటల్లో వచ్చిన సమస్యలు ఏంటి? ఆ సమస్యలకు వెన్నెల కిషోర్ కు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ మూడు జంటలు ఒక్కటయ్యాయా, లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
తొలి చిత్రం అయినప్పటికీ ఈ సినిమాలో ప్రధాన హీరోగా కనిపించిన పవన్ కళ్యాణ్ న్యాచురల్ గా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. కొత్తవాడైనప్పటికీ తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. సప్తగిరి, కసిరెడ్డి ఇప్పటికే ఎన్నో సినిమాలలో సోమదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన వీరు ఈ సినిమాలో కూడా వారి శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. కథానాయకులుగా రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. సన్నివేశాన్ని బట్టి ఎమోషన్స్ ముందుకు తీసుకువెళ్తూ సినిమాను ప్రేక్షకుల జీవితాలలో జరిగే సంఘటనలతో ముడివేస్తూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. వెన్నెల కిషోర్ ఉన్న స్క్రీన్ టైమ్ తక్కువ అయినప్పటికీ ఆయన ఉన్నంతసేపు నవ్వుల పండగగా ఉంటుంది. అలాగే చిత్రంలో ఇతర పాత్రలలో నటించిన నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నడుస్తూ సినిమాకు బలాన్ని చేకూర్చారు.
సాంకేతిక విశ్లేషణ :
టెక్నికల్‌గా సినిమాని చూసుకుంటే.. విజువల్స్ బాగానే ఉన్నాయనిపిస్తుంది. మ్యూజిక్ మెప్పిస్తుంది. అన్ని పాటలు తెరపై బాగానే ఉంటాయి. పెట్టిన ఖర్చుకి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టుగా ఉంటుంది. కొత్త నిర్మాతే అయినా ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదన్నట్టుగా కనిపిస్తుంది. భార్యాభర్తల బంధం గురించి చెప్పే డైలాగ్స్, కసిరెడ్డితో చెప్పించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్నీ కూడా ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
చిత్ర విశ్లేషణ :
భార్యాభర్తల సమస్యలు, గిల్లికజ్జాలు, గొడవలు అనే కాన్సెప్ట్ ఎవర్ గ్రీన్. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఎన్నెన్నో క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. ఈ మధ్య ఇలాంటి ఫ్యామిలీ గొడవలతో ఓ చక్కని కుటుంబ కథా చిత్రం రాలేదు. అయితే డైరెక్టర్ మాత్రం థియేటర్లో అందరూ హాయిగా నవ్వుకునేలా ఓ కుటుంబ కథా చిత్రాన్ని తీసే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సగటు పెళ్లైన మగాడు ఈ సినిమాకి కనెక్ట్ అవుతాడు. భార్యా భర్తలు ఈ మూవీని చూస్తే ఎక్కడో చోట రిలేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
మూడు జంటల్ని పరిచయం చేసిన తీరు, వారికి ఏదో సమస్య ఏర్పడిందని చెప్పకనే చెప్పేలా ఓపెన్ చేసిన సీన్స్ అన్నీ బాగుంటాయి. ఇక కోర్టులో వచ్చే వాయిదాలు, వారి కథని జడ్జ్ కొంచెం కొంచెంగా వినడం, ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయడం ఇలా అన్నీ బాగానే సాగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఓ ఇరవై నిమిషాల పాటు అద్భుతంగా నడుస్తుంది. అక్కడ వెన్నెల కిషోర్ చేత చేయించిన బ్లాక్‌కి థియేటర్లో అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఇక అక్కడ ఎమోషనల్ టచ్ ఇస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
సెకండాఫ్‌లో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, రోజితో లవ్ ట్రాక్ ఇదంతా కాస్త వింటేజ్ మోడ్‌లోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. రాజ్ కుమార్ జంపింగ్ డైలాగ్స్ ప్రతీ చోటా పేలుతాయి. ఇక సెకండాఫ్‌లోని హౌస్ హజ్బెండ్ అనే కాన్సెప్ట్ చుట్టూ అల్లిన ఎపిసోడ్ కూడా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్‌లో భార్యాభర్తల బంధం గురించి చెప్పిన తీరు ఇలా అన్నీ బాగానే ఉంటాయి. అలా టోటల్‌లో ఓ ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ సినిమాని చూసిన ఫీలింగ్ అయితే ఆడియెన్స్‌కి వస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
కథ, హాస్యం, నిర్మాణ విలువలు.
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే, కొన్ని అనవసరమైన సన్నివేశాలు.
సారాంశం :
ఫ్యామిలీతో కలిసి ఈ వేసవిలో చల్లగా నవ్వుకుంటూ భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని తెలుపుతూ చూడదగిన చిత్రం పురుష:


