పర్సంటేజ్ విధానం పై మెగాస్టార్ చిరంజీవి గారితో సమావేశమైన తెలుగు సినీ పెద్దలు

సింగిల్ స్క్రీన్స్ కి పర్సెంటేజ్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఈ రోజు మధ్యాహ్నం, మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి దృష్టికి తీసుకొచ్చారు.

విషయాలన్నీ  పూర్తిగా  విన్న  శ్రీ  చిరంజీవి పరిశ్రమ లో  భాగస్వాములయిన  అందరికీ  పూర్తి న్యాయం జరిగేలా వుండాలని, ఒక్క  సినిమా  గురించో, ఒక్క  సెక్టార్  గురించో  ఈ  చర్చ కాదని, అందరికీ  ఆమోదయోగ్యంగా  వుండాలనే పరిశ్రమ  కొన్ని పద్దతులను  ఏర్పరుచుకుంది అన్నారు.   

తెలుగు  చిత్ర  పరిశ్రమ కి  హైయెస్ట్  బాడీ  తెలుగు  ఫిలిం  ఛాంబర్  ఆఫ్  కామర్స్  అన్న  విషయాన్ని  గుర్తు చేసి, ఆ  ఛాంబర్  తీసుకున్న  నిర్ణయానికి  కట్టుబడి  వుండటం అందరికీ  సముచితం  అన్నారు. ఒకసారి  అందరినీ  సంప్రదించి , పర్సెంటేజ్ మోడల్ మీద ఒక  కమిటీని  ఏర్పాటు  చేస్తూ ఛాంబర్  ఒక  నిర్ణయాన్ని  తీసుకున్న  తర్వాత  దాన్ని  వ్యతిరేకిస్తూ  మీడియా  ముందు ఏ ఒక్కరూ అభిప్రాయాలు  వ్యక్తపరచటం తగదని అన్నారు. ఇలాంటి వాటివల్ల  ఇండస్ట్రీ ఒక్కటిగా  లేదన్న సందేశం  ఇవ్వకూడదని  అన్నారు. 

ఇంతకు  ముందు  వేసిన  వేరే  కమిటీ ల  పని  తీరు, ఫలితాల పట్ల  సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత   అసంతృప్తి, అపనమ్మకం  వుందన్న  విషయం  అర్ధం అయిందన్నారు. ఈ సారి  ఛాంబర్  ఏర్పాటు చేసిన  కమిటీ  అనుకున్న గడువులో  అంటే  జూన్  30 వ  తేదీ  వరకూ, అన్ని  విషయాలని పూర్తిగా  పరిశీలించి  ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్ర్స్, ఎక్సహిబిటర్స్ అందరికీ  న్యాయం  జరిగేలా  పర్సెంటేజ్ మోడల్ మీద  ప్రతిపాదనని  చేస్తుందని  తనకు  నమ్మకం వుందని,  ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు  పూర్తిచేసి  నివేదిక  ఇవ్వటానికి  తనవంతు కూడా పూర్తి  ప్రయత్నం   చేస్తానని   శ్రీ చిరంజీవి  హామీ  ఇచ్చారు.

శ్రీ  చిరంజీవి  సమయం వెచ్చించి  తమకున్న సమస్యలని, భయాలని,  ప్రస్తుతం  సింగిల్  స్క్రీన్స్  కి  వున్న  పరిస్థితులని అవగాహన  చేసుకుని  అందరికీ  న్యాయం  జరిగేలా  చూస్తానని  భరోసా  ఇవ్వటం పట్ల  సభ్యులందరూ పూర్తి సంతృప్తి  వ్యక్తం చేశారు. వారి  అసోసియేషన్స్ లో  వున్న  మిగతా  సభ్యులందరికి ఈ సమావేశం గురించి  తెలియచేసి  24 గంటలలో తమ ఆమోదాన్ని  తెలియచేస్తామని  తెలిపారు. 

ఈ  సమావేశంలో  TFCC  ప్రెసిడెంట్  శ్రీ  సురేష్  బాబు, శ్రీ  అల్లు  అరవింద్, TFDC  చైర్మన్ శ్రీ  దిల్  రాజు, ప్రముఖ  నిర్మాతలు  శ్రీ  కేఎల్ నారాయణ, శ్రీ  సునీల్  నారంగ్,  శ్రీ  భరత్  నారంగ్, తెలంగాణ  ఫిలిం  ఛాంబర్ ప్రెసిడెంట్  శ్రీ  శేఖర్,  శ్రీ అనుపమ్ , శ్రీ  శ్రీధర్, శ్రీ  సదానంద్  గౌడ్, సుదర్శన్   థియేటర్ ప్రొప్రయిటర్ శ్రీ రాజ్   తదితరులు  పాల్గొన్నారు.

Related Articles

Latest Articles