ETV WIN “ఇల్లు” రివ్యూ

ఓ ఇల్లు కేవలం నాలుగు గోడల సమాహారమా? లేక మన జ్ఞాపకాలు, అనుభూతులు, జీవిత ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచే ఒక భావోద్వేగమా? ఈ ప్రశ్నకు హృదయాన్ని తాకే సమాధానం చెప్పే చిత్రమే ETV Winలో స్ట్రీమింగ్ అవుతున్న 45 నిమిషాల తెలుగు చిత్రం “ఇల్లు”.

రోహిత్ పెనుమత్స దర్శకత్వంలో, క్యాంప్ ససి రచనలో రూపొందిన ఈ చిత్రం ఒక ఫ్రీలాన్స్ రచయిత(హర్ష వర్ధన్) కృష్ణ ప్రసాద్ జీవితాన్ని కేంద్రంగా తీసుకుని సాగుతుంది. ఎన్నో జ్ఞాపకాలు, పుస్తకాలు, మొక్కలతో మమేకమైన తన ఇంటిని పరిస్థితుల కారణంగా వదిలి కొత్త ఇల్లు వెతకాల్సి వచ్చినప్పుడు అతను ఎదుర్కొనే భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో సహజంగా ఆవిష్కరించారు.

హర్ష వర్ధన్, బిందు చంద్రమౌళి తమ సహజమైన నటనతో పాత్రలకు జీవం పోశారు. ముఖ్యంగా వారి మధ్య ఉండే సంభాషణలు, నిశ్శబ్ద క్షణాలు కథకు మరింత బలం చేకూర్చాయి. శశాంక్ రాఘవుల సినిమాటోగ్రఫీ ఇంటి అందాన్ని, దానితో ముడిపడిన అనుబంధాన్ని అద్భుతంగా చూపించగా, వివేక్ సాగర్ సంగీతం భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేసింది.

ఇల్లు వెతికే క్రమంలో బ్యాచిలర్ లైఫ్, కులం, ఉద్యోగం వంటి సామాజిక అంశాలను సున్నితంగా ప్రస్తావించిన తీరు బావుంది. అలాగే హైదరాబాద్‌లో పెరుగుతున్న అద్దెల సమస్యను కూడా కథలో సహజంగా చూపించారు.

భారీ మలుపులు, హంగులు లేకుండానే ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తూ, ఒక ఇంటితో మనిషికి ఉండే అనుబంధాన్ని హృద్యంగా చెప్పిన చిత్రం “ఇల్లు”. మంచి కథనాలను, జీవితానికి దగ్గరగా ఉండే చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు ఇది తప్పక చూడదగ్గ సినిమా.

Related Articles

Latest Articles