
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉందని సినీ నటుడు నరేష్ విజయకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో జరిగిన పరిణామాల తరహాలో ఏపీలో కూడా క్రైస్తవ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు కలిసి కొత్త రాజకీయ శక్తిని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభ, జైభీమ్ పార్టీ అధినేత లాయర్ జడ శ్రవణ్ కుమార్‌కు సంబంధించిన పరిణామాలపై నరేష్ వరుసగా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు చేశారు. సభ అనంతరం నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ వ్యూహంలో భాగమేనని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 1న చేసిన తన పోస్టును గుర్తు చేస్తూ, తాను ముందుగానే ఈ పరిణామాలపై హెచ్చరించానని నరేష్ తెలిపారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలు తదితరులు జడ శ్రవణ్ కుమార్‌కు మద్దతుగా నిలుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీని వెనుక మతపరమైన, రాజకీయపరమైన వ్యూహం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
అయితే తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుని కాదని, కేవలం రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న వ్యక్తిగా మాత్రమే ఈ అభిప్రాయాలు వెల్లడిస్తున్నానని నరేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ఈ పరిణామాలను గమనించాలని, భవిష్యత్తులో వీటి ప్రభావం రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలపైనా ఉండొచ్చని ఆయన హెచ్చరించారు.
తన గత పోస్టులో కూడా జైభీమ్ పార్టీ, ఇతర రాజకీయ శక్తులు కలిసి దళిత, క్రైస్తవ ఓట్లను లక్ష్యంగా చేసుకుని కొత్త రాజకీయ వేదికను నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయని నరేష్ పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఎన్నికలు సిద్ధాంతాలకు, ధర్మానికి మధ్య జరిగే పోరాటంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
దాదాపు పదహారేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న నరేష్ అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


