‘వసుదేవసుతం’ మూవీ రివ్యూ

కథ :
పురుషోత్తమపురిలోని వాసుదేవ ఆలయం చుట్టూ కథ సాగుతుంది. ఆలయ చైర్మన్ శర్మ హత్య అనంతరం ఆలయ అధికారంపై పోరు మొదలవుతుంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఉండే కృశవ్ (మహేంద్రన్) ఉత్సవాల కోసం ఊరికి వస్తాడు. అక్కడ హీరా బంధు మేనకోడలు భువి (అంబికా వాణి)తో ప్రేమలో పడతాడు. అయితే ఆలయంలో జరిగిన సంఘటనలు, కోయిరాతల అనే రహస్య ప్రదేశం, కృశవ్ గతం, అతను జైలుకు ఎందుకు వెళ్లాడు? ఎందుకు తప్పించుకున్నాడు? ఆలయంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

నటీనటుల నటన :
మహేంద్రన్ తన పాత్రలో మంచి ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటాడు. అంబికా వాణి తన పాత్రకు న్యాయం చేసింది. మైమ్ గోపి, జాన్ విజయ్ విలన్ పాత్రల్లో మంచి నటన కనబరిచారు. హీరో అక్క, బావ పాత్రల్లో నటించిన వారు కూడా భావోద్వేగాలను బాగా పండించారు. రాజీవ్ కనకాల, తులసి, ఆటో రామ్ ప్రసాద్, దువ్వాసి మోహన్, శివన్నారాయణ తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.

సాంకేతిక విశ్లేషణ :
సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది. పూరి ఆలయ నేపథ్యాన్ని అందంగా చూపించే ప్రయత్నం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో ఇంకా బలంగా ఉంటే బాగుండేది. పాటలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ కొద్దిగా క్రిస్పీగా ఉంటే సినిమా మరింత వేగంగా అనిపించేది. దర్శకుడు ఎంచుకున్న కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, కథనాన్ని ఇంకాస్త పకడ్బందీగా మలిచి ఉంటే ప్రభావం మరింత పెరిగేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చిత్ర విశ్లేషణ :
ఫస్ట్ హాఫ్‌లో ఆలయ రాజకీయాలు, హీరో-హీరోయిన్ల ప్రేమకథ, కోయిరాతల రహస్యం చుట్టూ కథ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది.
సెకండ్ హాఫ్‌లో హీరో ఫ్లాష్‌బ్యాక్, ఆలయంలోని రహస్యాలపై కథ దృష్టి సారిస్తుంది. ట్రెజర్ హంట్ అంశాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది. సినిమాలో దేవాలయం, పురాణ అంశాలు, నిధి రహస్యం వంటి అంశాలను మిళితం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేది. క్లైమాక్స్‌లో పార్ట్-2కి ఇచ్చిన లీడ్ ఆసక్తిని కలిగిస్తుంది.

సారాంశం :

‘వసుదేవసుతం’ దేవాలయ నేపథ్యంతో తెరకెక్కిన మిస్టరీ-యాక్షన్ డ్రామా. కథలో మంచి పాయింట్ ఉండటంతో పాటు కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. దేవాలయ రహస్యాలు, మిస్టరీ కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఒకసారి చూడదగిన ప్రయత్నంగా చెప్పొచ్చు.

Related Articles

Latest Articles