రాజమౌళి, మహేష్ బాబు, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా నా డ్రీమ్ టైటిల్‌ను స్వచ్చందంగా ఇచ్చేశాను – దర్శకుడు సుబ్బారెడ్డి

దర్శకుడు సుబ్బారెడ్డి తన వద్ద రిజిస్టర్ అయిన ‘వారణాసి’ సినిమా టైటిల్‌ను దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న, మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, దర్శకుడు సుబ్బారెడ్డి కలిసి ఇంటర్వ్యూ లో చర్చించారు.

దర్శకుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 2023లో ‘వారణాసి’ టైటిల్‌ను తన బ్యానర్‌పై రిజిస్టర్ చేసుకుని ఆ కథపై పని ప్రారంభించానని తెలిపారు. అయితే అదే టైటిల్ రాజమౌళి సినిమా కోసం అవసరమైందని తెలిసిన తర్వాత, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. తన అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ కలిసి చేస్తున్న ఈ భారీ చిత్రానికి టైటిల్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

టైటిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారంగా చూడలేదని, ఒక్క రూపాయి కూడా తీసుకోవాలనే ఆలోచన తనకు రాలేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. “టైటిల్ అనేది నాకు ఒక ఎమోషన్. దాన్ని అమ్మడానికి కాదు, మంచి సినిమా కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాను” అని పేర్కొన్నారు.

దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ, మొదట సుబ్బారెడ్డి ఆ టైటిల్‌పై ఎంతో భావోద్వేగంతో ఉన్నారని, అందుకే వెంటనే మాట్లాడలేదన్నారు. తరువాత రాజమౌళి, కేఎల్ నారాయణ వంటి ప్రముఖుల చిత్రం కోసం టైటిల్ ఇస్తే ఇండస్ట్రీకి మంచి సందేశం వెళ్తుందని వివరించగా, సుబ్బారెడ్డి వెంటనే అంగీకరించారని తెలిపారు.

టైటిళ్లను డబ్బు కోసం కాకుండా, పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరస్పరం సహకరించుకోవాలని ఈ నిర్ణయం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని వీరశంకర్ అభిప్రాయపడ్డారు. సుబ్బారెడ్డి చేసిన ఈ నిర్ణయం భవిష్యత్‌లో ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయరచయిత చంద్రబోస్‌లకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘వారణాసి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Related Articles

Latest Articles