
సుగి విజయ్, జుప్సీ భద్ర హీరో హీరోయిన్లుగా నటిస్తూ పరమేష్ రేణు కుంట్ల దర్శకత్వంలో ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్’.
విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి వరకుప్పల యాదగిరి అందించగా ఆవుల వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. బేబి తమోఘ్న, రాధ రాయసం, లక్ష్మి, జాకీర్, విజయ్ కుమార్, దాసరి పద్మ రేఖ, శ్రీదేవి ఆర్రోజు, మెయిల్ రమేష్, అరుణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ నటి ఇందు, అఖండ సుధాకర్ రెడ్డి తదితరులు పోషించిన ఈ చిత్రం నేడు విడుదల కాగా రివ్యూ విషయానికి వస్తే…
కథ :
పెళ్లి అంటే అంతగా ఇంట్రెస్ట్ లేక కేవలం సినిమాలకు మాత్రమే తన జీవితాన్ని పరిమితం చేసిన ఒక యువకుడు, పెళ్లికి ముందు ఏం చేసినా కూడా పెళ్లి మాత్రం తన తండ్రి చూసిన వ్యక్తితోనే అనుకునే ఒక యువతి మధ్య ప్రేమకథగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. తన తండ్రి మాట జవదాటని కూతురు తన తండ్రి చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తుంది. కానీ పెళ్ళికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ తో కొన్ని కోరికలు తీర్చుకోవాలి అనుకుంటుంది. అదే సమయంలో పెళ్లి పై ఇంట్రెస్ట్ లేని ఒక యువకుడు సినిమాలపై మక్కువతో కథలు నిర్మాతలకు వినిపిస్తుండగా ఒక నిర్మాత చిన్నపాటి ప్రేమ కథ ఉంటే చేయాలనుకుంటున్నారని చెబుతుంది. ఈ సమయంలో ఈ అమ్మాయి అతడికి పరిచయం కాగా తన కథ కోసం అబ్బాయి అలాగే తన కోరికల కోసం అమ్మాయి కలిసి ప్రయాణం మొదలుపెడతారు. వీరి ప్రయాణం అక్కడితో ఆగిపోతుందా లేదా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుందా? అమ్మాయి తండ్రి ఈ విషయాన్ని ఎలా తెలుసుకుంటాడు? తెలుసుకున్నాక అతడి రియాక్షన్ ఏంటి? అసలు వీరిద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఏం తెలుసుకుంటారు? చివరికి వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఈ చిత్రంలో హీరోగా నటించిన సుగి విజయ్ ఒక బ్యాలెన్స్ నటనతో సినిమా అంతట కనిపిస్తారు. ఎమోషన్స్ నుండి కామిడీ వరకు చాలా సెటిల్ పెర్ఫార్మెన్స్ తో ఆయన నటించారు. అలాగే హీరోయిన్ గా నటించిన జుప్సీ భద్ర ఒకవైపు ఐటి ఎంప్లాయ్ లాగా కనిపిస్తూనే మరోవైపు తన తండ్రి మాటకు విలువ ఇచ్చే విధంగా రెండు బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా నటించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసిన మరొక ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్ స్నేహితురాలిలా కనిపిస్తూ సినిమా అంతట అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. 30 ఇయర్స్ పృథ్వీరాజ్ తెరపై కనిపించింది తక్కువ అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్ర పోషించారు. సినిమాలో ఇతర పాత్రలు పోషించిన వారంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
చిత్ర, సాంకేతిక విశ్లేషణ :
ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా తీసుకుని ప్రస్తుత సమాజంలో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో వాటి నుండి కొన్ని విషయాలను సేకరించి నేటి యువతకు సందేశాత్మకంగా అందిస్తూనే ఇంట్లో తల్లిదండ్రుల విలువను ఎంటర్టైన్మెంట్ తో కలిపి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఈ కథను వెండితెరపై తీసుకురావడంలో దర్శకుడు విజయం సాధించారు. సినిమాలో పాటలు అంతగా ఇంపాక్ట్ చూపించినప్పటికీ బిజిఎం బాగుంది. సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించినప్పటికీ సినిమా అయితే పర్వాలేదు. సాంకేతిక విషయాలు బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ప్రస్తుత పరిస్థితులకు అందరూ అర్థం చేసుకునేలా ఉన్న కథ, నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్
మైనస్ పాయింట్స్ :
పాటలు, కొన్ని సన్నివేశాలు
సారాంశం :
ప్రస్తుతం యువతలో పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని చూపుతోనే టెంపరరీ సంతోషాల కోసం చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాలు ఇటువంటి మలుపులు తిరుగుతాయో, జీవితాల పై ఎటువంటి ప్రభావం ఉంటుందో చెప్పే సినిమా ఐ హేట్ మ్యారేజ్.


