
జై ఙ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మాతగా వరుణ్ సందేశ్, వితికా షేరు, సాయి కుమార్, సుమన్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం ధర్మస్థల నియోజకవర్గం. మహావీర్ ఏలేందర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సాయిబాబు తలారి ఎడిటర్ గా పనిచేశారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ధర్మస్థల నియోజకవర్గంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బైర్రాజు(సాయి కుమార్) తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఉంటాడు. అయితే అదే ప్రాంతంలో వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య కస్తూరి కాలేజీ పేరుతో డ్రగ్స్ దందా నడుపుతుంటారు. విద్యార్థులను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చే ఈ వ్యవహారాన్ని లెక్చరర్ అరుంధతి(వితిక షేరు) కొందరు విద్యార్థుల సహాయంతో ఎదిరిస్తుంది. ఈ క్రమంలో విద్యార్థి బద్రి హత్యకు గురవుతాడు. తన కొడుకు మరణానికి ఎమ్మెల్యే బైర్రాజే కారణమని తెలుసుకున్న టీ కొట్టు నడిపే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. విద్యార్థుల మద్దతుతో ఏడు సార్లు గెలిచిన బైర్రాజుపై ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ధనబలం, రాజకీయ అనుభవం ఉన్న బైర్రాజును ఈశ్వరయ్య ఎలా ఎదుర్కొన్నాడు? విద్యార్థులతో కలిసి అతని రాజకీయ ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? బద్రి హత్యకు కారణమైన వారిని ఎలా శిక్షించాడు? ఈశ్వరయ్య గెలిచిన తర్వాత ధర్మస్థలలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేదే తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
టీ కొట్టు నడిపే సామాన్యుడు ఈశ్వరయ్యగా సుమన్ చక్కగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బైర్రాజుగా సాయికుమార్ తన మార్క్ నటనతో మెప్పించారు. అయితే ఇలాంటి రాజకీయ నాయకుడి పాత్రలు ఆయన గతంలోనూ చేయడంతో కొత్తగా అనిపించదు. విలన్ పాత్రల్లో రాజీవ్ కనకాల, కస్తూరి ఆకట్టుకున్నారు. సత్య ప్రకాష్ కుమారుడు నటరాజ్ విద్యార్థి పాత్రలో మెప్పించగా, ఆయనకు జోడిగా నటించిన రాయంచ కొక్కుర కూడా బాగా నటించింది. శివకుమార్ యంగ్ విలన్‌గా తన పాత్రకు చక్కగా సరిపోయాడు. సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ, వరుణ్ సందేశ్, కాలకేయ ప్రభాకర్ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక విశ్లేషణ :
మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ రాసిన పాటలు, సందర్భానుసారంగా సాగే లిరిక్స్ ఆకట్టుకుంటాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్‌గా నిలిచింది. అయితే ఎడిటింగ్ మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, సంగీతం
మైనస్ పాయింట్స్ :
కొన్ని స్లో సన్నివేశాలు
సారాంశం :
ఒక మంచి సందేశంతో, ఆలోజింపచేసే చిత్రం ధర్మస్థల నియోజకవర్గం.


