పాల్వంచలో అట్టహాసంగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవ వేడుక

పేదల పక్షపాతి, సైకిల్ పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 6) పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రయూనిట్ తో పాటు సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు స్క్రిప్ట్ అందించారు.

ఈ సందర్భంగా వేదికపై దర్శకుడు పరమేశ్వర్ మాట్లాడుతూ.. ”అందరికీ నమస్కారం. ప్రభుత్వం తరఫున వచ్చిన సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, కవితక్క గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. మనం బతకడం కోసం రాజకీయాలకు రావొద్దు. మనం నమ్ముకున్న ప్రజలను బతికించడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో, వ్యాపారమో కాదు.. ఇదొక సామాజిక బాధ్యత అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ సినిమా చేశాను. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ప్రజాసేవ తప్ప పైసా కూడా సంపాదించుకోని గుమ్మడి నర్సయ్య గారి గొప్పతనాన్ని మీరు తెరపైనే చూడాలి. ఒక గొప్ప కథలో ఒక గొప్ప హీరో దొరకడం నా అదృష్టం. డాక్టర్ శివ రాజ్ కుమార్ గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకొని ముందుకు రావడం, నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి గారు ఈ సినిమా నిర్మించడం చాల గొప్ప విషయం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అన్నారు.

నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. ”మా సినిమా గుమ్మడి నర్సయ్యగా నటించిన శివరాజ్ కుమార్ ఓ రియల్ హీరో, మనసున్న మనిషి. మీరు గుమ్మడి నర్సయ్య రోల్ పోషిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఉద్యమగడ్డ అయిన పాల్వంచ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని భావిస్తున్నా” అన్నారు.

హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ”ఒక మంచి మనిషి రోల్ లో నటిస్తున్నందుకు ఈ రోజు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పరమేశ్వర్ గారికి, ఎన్. సురేష్ రెడ్డి గారికి థాంక్స్. మా నాన్న గారు కూడా గుమ్మడి నర్సయ్య లాగే ప్రజాసేవ చేసిన మనిషి. మన కోసం కాదు.. ఇతరుల కోసం బతకాలని’ మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. రీసెంట్ గా గుమ్మడి నర్సయ్య గారి ఇంటికి వెళ్తే మళ్ళీ మా నాన్న గారి దగ్గరకు వచ్చినట్లు అనిపించింది. ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్యగా నటించడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటా.. నేనే స్వయంగా డబ్బింగ్ చెబుతా. మీ అందరి ఆశీర్వాదం మాపై ఉంటుందని ఆశిస్తున్నా. ఈ సినిమా అందరు రాజకీయ నాయకులకు ఇన్స్పిరేషనల్ సినిమా అవుతుంది” అన్నారు.

గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ”ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి.. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతులు మారాలి.. ఇదే నేను కోరుకునేది. నేనేం గొప్ప నాయకుడిని కాదు, అందరిలా సామాన్యుడిని మాత్రమే. నన్ను గొప్పగా కాకుండా నా భావాలను మాత్రమే ఈ సినిమాలో చూపించాలని, చూపిస్తారని ఆశిస్తున్నా. నా బాల్యం నుంచి మొదలు ఇప్పటిదాకా నా గురించి తెలుసుకొని పరమేశ్వర్ గారు ఈ సినిమా రూపొందించారు. శివరాజ్ కుమార్ గారు నా రోల్ చేయడం సంతోషకరం. ఈ సినిమా రిలీజ్ తర్వాత వ్యవస్థలో, ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నా” అన్నారు.

కాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, ఇతర అప్ డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ లుక్ ఆకట్టుకుంది. దీంతో యావత్ తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.

సాంకేతిక సిబ్బంది :
బ్యానర్- ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్
నిర్మాత – ఎన్.సురేష్ రెడ్డి (ఎన్ఎస్ఆర్)
దర్శకుడు – పరమేశ్వర్ హివ్రాలే
డిఓపి-సతీష్ ముత్యాల
ఎడిటర్ – సత్య గిడుతూరి
సంగీత దర్శకుడు – సురేష్ బొబ్బిలి
PRO-సాయి సతీష్

Related Articles

Latest Articles