
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న “రణబాలి” సినిమా నుంచి రీసెంట్ గా వెడ్డింగ్ పోస్టర్, సాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. వింటేజ్ లుక్ లో ఎంతో సహజంగా ఉన్న ఈ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. విరోష్ వెడ్డింగ్ జరిగిన కొద్ది గంటల్లోనే ఈ పోస్టర్, సాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ పోస్టర్ వెనక ఉన్న బ్యాక్ స్టోరీ, ఆ పోస్టర్ డిజైన్ చేయించడంలో పడిన తపనను తాజాగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు దర్శకుడు రాహుల్ సంకృత్యన్.
డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ స్పందిస్తూ – రీసెంట్ గా మేము “రణబాలి” సినిమా నుంచి వెడ్డింగ్ పోస్టర్ రిలీజ్ చేశాం. అది పోస్టర్ మాత్రమే కాదు ఒక సందర్భం. పాత ఫొటోగ్రాఫ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు తీసుకున్న ఫొటోస్ చూస్తే ఎక్కడా అసహజంగా ఉండవు. వాళ్ల తమ జీవితాల్లో ఎలా ఉంటారో ఆ ఫొటోస్ లోనూ అంతే సహజంగా కనిపించేవారు. ఆ ఫొటోస్ లో నిజాయితీ కనిపించేది. 18వ శతాబ్దం నేపథ్యంగా “రణబాలి” చిత్రాన్ని రూపొందించాలని నేను అనుకున్నప్పుడు ఇలాంటి నిజాయితీనే ప్రతి ఫ్రేమ్ లో ప్రదర్శించాలని భావించాను. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేని ఆ కాలంలో పెళ్లిలో ఒక హుందాతనం కనిపించేది, వివాహం అంటే ఒక శాశ్వత బంధం అనే నమ్మకం ఉండేది. ఈ చిత్రంలో పెళ్లి దుస్తుల్లో విజయ్, రశ్మిక సెట్ లో అడుగుపెట్టినప్పుడు నాకు యాక్టర్స్ లా అనిపించలేదు. ఆ కాలపు వధూవరులు నడిచివచ్చారా అనిపించింది. సింపుల్ బ్యాక్ డ్రాప్ లో, సింపుల్ లైటింగ్ లో ఆ ఫొటో క్యాప్చర్ చేశాం. విజయ్, రశ్మిక నిజ జీవితంలో వైవాహిక బంధంతో ఒక్కటైనప్పుడు మా మూవీలోని వెడ్డింగ్ సీన్ షూటింగ్ చేసిన సందర్భంగా గుర్తొచ్చింది. కొన్నిసార్లు సినిమా, జీవితం అడుగులో అడుగేస్తాయి. అని పేర్కొన్నారు.
టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” సినిమా రూపొందుతోంది.


