3D టెక్నాలజీలో రానున్న సుధీర్ అత్తవార్ పాన్ ఇండియా చిత్రం ‘కోరగజ్జ’

తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించబడే దైవం కొరగజ్జ కథ ఆధారంగా ఓ శక్తివంతమైన సినిమా రాబోతోంది. ‘కొరగజ్జ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ సాపల్య నిర్మిస్తున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ ఈ చిత్రానికి దర్శకత్వం, కథా రూపకల్పన, స్క్రీన్‌ప్లే, సంభాషణలను స్వయంగా అందిస్తున్నారు. అయితే ఈ మూవీని రీసెంట్‌గానే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

‘కొరగజ్జ’ చిత్రాన్ని చూసిన అంతర్జాతీయ బృందం ఇచ్చిన సలహా మేరకు వాయిదా వేశారట. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్‌లోకి మార్చితే ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పారట.
‘కోరగజ్జ’ను ‘ప్రపంచ స్థాయి చిత్రం’గా వారు అభివర్ణించారట. సినిమాలోని లొకేషన్లు, నిర్మాణ నాణ్యత, సినిమాటిక్ స్థాయిని మెచ్చుకున్నారట. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్‌లోకి మార్చాలని వారు ఇచ్చిన సలహాతోనే వాయిదా వేశారట. సినిమాని 2డీ నుంచి 3డీకి మార్చేందుకు టీంకి చాలా టైం కావాల్సి వస్తోంది.

ఈ అప్‌గ్రేడ్‌పై దర్శకుడు సుధీర్ అత్తవార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాదాపు 40 మంది నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం ఈ త్రీడీ ఫార్మాట్ కోసం పనిచేస్తోంది. దృశ్య అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, క్లైమాక్స్‌ను నీటి అడుగున తిరిగి చిత్రీకరించారు. ఈ సన్నివేశాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న మలయాళ స్టార్ మోహన్‌లాల్‌కు చెందిన ‘విస్మయ’ స్టూడియోలో చిత్రీకరించారు. ఈ షూట్ కోసం ప్రత్యేకంగా నీటి అడుగున సెట్‌ను నిర్మించగా, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పిళ్ళై నాలుగు కెమెరాలను ఉపయోగించి ఈ సన్నివేశాలను చిత్రీకరించారు.

డాక్టర్ రాజ్‌కుమార్ తర్వాత కన్నడ చిత్రసీమలో అరుదైన సంఘటనగా నటి శృతి నీటి అడుగున సన్నివేశాలలో స్వయంగా నటించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ స్టంట్స్ చేయడానికి ముందు ఆమె దాదాపు 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. షూటింగ్ అంతటా స్కూబా డైవర్లు, వైద్య సిబ్బంది, అంబులెన్స్‌తో సహా భద్రతా బృందాలు అందుబాటులో ఉన్నాయి.

శృతి దాదాపు 30 అడుగుల ఎత్తు నుండి హార్నెస్ ధరించి నీటిలోకి దూకి, కెమెరా ముందే పైకి తేలడం అనేది ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఆమె ఆక్సిజన్ సహాయం లేకుండా 22 సెకన్ల పాటు నీటిలోపల చిత్రీకరణలో పాల్గొని, తన అద్భుతమైన నిబద్ధతను ప్రదర్శించింది. ఈ మార్పులు, చేర్పుల వల్ల సినిమా బడ్జెట్ గణనీయంగా పెరిగింది. కేవలం నీటిలోపలి సన్నివేశం కోసమే నిర్మాత త్రివిక్రమ్ సపల్య అదనంగా 12 కోట్లు పెట్టుబడి పెట్టారని ఎగ్జిక్యూటివ్ నిర్మాత విద్యాధర్ శెట్టి తెలిపారు.

Related Articles

Latest Articles