
ఇటీవల ‘తూలికా తనిస్క్ క్రియేషన్స్’ బ్యానర్‌పై “పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని నిర్మించి సినీ రంగ ప్రవేశం చేసిన నిర్మాత, మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ ఆకస్మికంగా మృతి చెందారు.
ఉగాది పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారి ఊరైన కట్టంగూరు వెళ్లిన ఆయన, 22వ తేదీన అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా ప్రమాదం జరిగింది. నీటి అడుగున తల బలంగా తగలడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
మాజీ సైనికుడైన జనార్ధన్ గారికి, 23వ తేదీన ఆయన స్వగ్రామమైన నకిరేకల్ మండలంలోని ‘పాలెం’లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల చిత్ర దర్శకుడు బాబ్జీ, సినిమా యూనిట్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.


