
బాలీవుడ్లో హీరోల డేట్స్, అడ్వాన్సులు, కమిట్మెంట్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హీరో రణ్వీర్ సింగ్ నటించాల్సిన ‘డాన్ 3’ సినిమా వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
సినిమాకు సంతకం చేసి భారీ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత రణ్వీర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్మాతలు రూ.45 కోట్ల నష్టపరిహారం కోరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అవసరమైతే బ్యాన్ వరకు వెళ్లొచ్చన్న టాక్ కూడా బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది.
ఈ సమస్య ఒక్క రణ్వీర్కే పరిమితం కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్సులు తీసుకుని, నిర్మాతలను సంవత్సరాల పాటు వెయిట్ చేయిస్తున్న హీరోలు చాలామందే ఉన్నారనే అసంతృప్తి చాలా కాలంగా ఉంది.
టాలీవుడ్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హీరోలపై నమ్మకంతో నిర్మాతలు కోట్ల రూపాయల అడ్వాన్సులు ఇచ్చి, వారి డేట్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు నిర్మాతలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘డాన్ 3’ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. కానీ హీరోలు, నిర్మాతల మధ్య కమిట్మెంట్ల విషయంలో ఇకపై కొత్త లెక్కలు మొదలయ్యే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.


