‘ఘాటి’ అనుష్క విశ్వరూపం

చాలా గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటి’. వేదం సినిమాతో అనుష్కలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు కృష్ణ జాగర్లమూడి.. ఈసారి అదిరిపోయే యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. సెప్టెంబర్ 5న ఘాటి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. మొత్తం 2 గంటల 37 నిమిషాల రన్‌ టైంతో థియేటర్లోకి రాబోతోంది ఘాటి. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభింనందించినట్టుగా తెలిసింది. యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు బాగున్నాయని తెలిపినట్టుగా చిత్ర యూనిట్ సమాచారం. అనుష్క చేసిన యాక్షన్ సినిమాకే హైలెట్‌గా నిలవనుందట. ఫస్ట్ హాప్ చాలా ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో సాగిందని, రైల్వే స్టేషన్ సీక్వెన్స్, గుహలో జరిగే యాక్షన్ ఫైట్, అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌ ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేస్తుందట. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు.. క్లైమాక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందట. ముఖ్యంగా అనుష్క పోషించిన శీలావతి పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉందట. ఆమె నటన సినిమాకు ప్రాణం పోసినట్టుగా చెబుతున్నారు.

ఈ మధ్య యాక్షన్ సినిమాలు అంటే ఎక్కువగా CGI, స్టూడియో ట్రిక్స్, బాడీ డబుల్స్ గుర్తొస్తాయి. కానీ ఘాటీలో అనుష్కనే స్వయంగా స్టంట్స్ చేసినట్టుగా సమాచారం. ఆమె చేసిన రా అండ్ రియలిస్టిక్‌ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయట. ఈ సినిమాతో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు తెలుగులో అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనే తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. అనుష్కతో కలిసి ఆయన చేసిన పోరాటం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందట. అలాగే.. అనుష్క-విక్రమ్ ప్రభు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టుగా సమాచారం. ఈ సినిమాలో 8 ఫైట్స్ ఉన్నాయని, అవి చూసి సెన్సార్ సభ్యులు సర్ప్రైజ్ అయ్యారట. అలాగే.. అనుష్క నట విశ్వరూపం చూపించినట్టుగా తెలిసింది. ఫైట్ మాస్టర్ రామ్ కృష్ణన్ యాక్షన్ సన్నివేశాలు, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సాయి మాధవ్ బుర్రా-చింతకింది శ్రీనివాసరావు డైలాగ్స్, సాగర్ నాగవెల్లి సంగీతం, ఒడిశాలోని సహజసిద్ద లొకేషన్స్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయని తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా విజువల్స్ చూసి దర్శకధీరుడు రాజమౌళి ఆశ్చర్యపోయారట. అంతేకాదు.. మహేష్ బాబు సినిమా కోసం ఇదే లొకేషన్స్‌ని పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Related Articles

Latest Articles