
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి నిర్లక్ష్య స్థితిలో ఉందంటూ జర్నలిస్ట్, యాంకర్ గౌతమి సోషల్ మీడియాలో వీడియో పంచుకోవడంతో నటుడు మనోజ్ మంచు స్పందించారు. దాసరి గారి పట్ల ఉన్న గౌరవంతో వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఆయన, మరుసటి రోజు ఉదయం స్వయంగా సమాధి వద్దకు చేరుకుని పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు.
తన బృందంతో కలిసి సమాధి పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, ఎండిన ఆకులను తొలగించి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. దాసరి నారాయణరావు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలిచాయని మనోజ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం మనోజ్ మంచు, మౌనిక భూమా మంచు ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేన సమితి’ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించబడింది. సమాజ సేవతో పాటు తెలుగు సినిమా మహానుభావుల వారసత్వాన్ని గౌరవించి కాపాడాల్సిన బాధ్యత అందరిదని ఈ సందర్భంగా మనోజ్ సందేశం ఇచ్చారు.
దాసరి గారి జ్ఞాపకాలను గౌరవిస్తూ, సమాధికి తగిన గౌరవం కల్పించేందుకు మనోజ్ చేసిన ఈ చర్యకు సినీ అభిమానులు, పరిశ్రమ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


